Tuesday, November 20, 2012

చిత్తూరు నాగయ్య పేదోడెలా అయ్యారు



 చిత్తూరు నాగయ్య అప్పట్లోనే అత్యధిక పారితోషికం పొందిన నటుడు. 1948లోనే ఆయన పారితోషికం లక్ష రూపాయలట! ఏ దురలవాటూ లేని వ్యక్తికి అంతటి ఆదాయం ఉంటే తన జీవితాన్ని సుసంపన్నంగా గడుపుతారనే మన మనుకుంటాం. కానీ, నాగయ్య దీనికి విరుద్ధమైన జీవితాన్ని గడిపారు. ఆయన జీవిత చరమాంకంలో చిన్న అవసరాలకు కూడా ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికంతటికీ కారణం... ‘తనకు మాలిన ధర్మం’!

దక్షిణ భారతదేశంలో నటనలో తొలిసారి పద్మశ్రీ అవార్డు పొందిన ఈయన నటనే కాదు, మనసు కూడా గొప్పది! సినిమా నిర్మాణం వల్ల నష్టపోయిన దానికంటే, తన అనాలోచిత దానధర్మాల వల్ల ఆస్తి ఎక్కువగా కరిగిపోయిందని తనే స్వయంగా పలుసార్లు వెల్లడించారు. మొదటినుంచీ బమ్మెర పోతన, వేమన వంటి పాత్రలు ఆయన మీద విపరీతమైన ప్రభావం చూపాయి. అసలే ఆయన చేతికి ఎముకుండదంటే, ఆ పాత్రలు వేయడం వల్ల అది ఇంకా శృతిమించింది.

‘త్యాగయ్య’ సినిమా తీసినన్నాళ్లు పనిచేసిన ప్రతి ఒక్కరికీ భోజనం, బస ఆయన రేణుకా ఆఫీసులోనే! అవుట్‌డోర్ షూటింగులని చూడడానికి వచ్చిన జనాలకి కూడా భోజనం పెట్టమనేవారట! అదే ఆయన్ను చివరి నాళ్లలో పేదరికంలోకి నెట్టింది. పొట్టపోసుకోవడానికి వంద రూపాయలకు కూడా వేషాలు వేసే పరిస్థితి వచ్చింది! దీంతో అత్యధిక, అత్యల్ప పారితోషికాల రికార్డు ఆయనదే అయ్యింది!

చివరి రోజులలో పేదరికాన్ని అనుభవిస్తున్నపుడు ఆయనన్న మాటలివి:  
నా జీవితం అందరికీ ఒక పాఠం. తనకు మాలిన ధర్మం చెయ్యకండి. అపాత్రదానాలు చెయ్యకండి. ఎందరో గోముఖవ్యాఘ్రాలు వుంటారు. అందర్నీ నమ్మకండి!  నిజంగా అవసరం ఉన్నవారికి సాయం చేయండి. కానీ, అది ఓ పరిమితి వరకు చేయండి. మీరు నాశనమయ్యేవరకు చేయకండి


No comments:

Post a Comment