Saturday, October 27, 2012

వ్యాపారం సుఖమా? ఉద్యోగం సుఖమా?


చాలా ఈజీగా కనిపించే కష్టమైన ప్రశ్న ఇది. మనిషి మనిషికీ సమాధానం మారుతుంటుంది. కాబట్టి, ప్రశ్న అడుగుతున్నదెవరు అన్నదానిని బట్టి దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఉద్యోగం అంటే ఎవరో ఒకరి కింద పనిచేయాలి. అదే వ్యాపారం అయితే మనకు మనమే బాస్ అనుకుంటారు చాలా మంది. ఇది అపోహ. ఉద్యోగంలో బాస్ ఒక్కరి మాట వింటే చాలు. వ్యాపారంలో ప్రతి వినియోగదారుడూ బాసే. అంతేకాదు, అది ఒక గాడిలో పడేంతవరకు ఎదురయ్యే సమస్యలు, ఆటంకాలు ఉద్యోగంలోనైతే ఎన్నడూ రావు. కష్టానికీ, నష్టానికీ మీరే బాధ్యులు అవుతారు. ఎంత చిన్న వ్యాపారం అయినా ఈ సమస్యలు తప్పవు. పెద్దమొత్తంలో డబ్బు కళ్ల చూడాలన్నా, మీ సమర్థత పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నా, స్వతంత్ర గుర్తింపు రావాలన్నా వ్యాపారం చేయాలి. ఏ వ్యాపారం మొదలుపెట్టే ముందయినా ఈ టిప్స్ తెలుసుకోవడం మంచిది. కీడెంచి మేలు ఎంచాలి కదా!


  • అప్పులు చేసి వ్యాపారం చేయొద్దు. పెట్టుబడి ఎంత పెడు తున్నారో అంతకు రెండు రెట్ల (కనీసం రెట్టింపు) సొమ్ము నిల్వ ఉండాలి. కొన్ని వ్యాపారాలకు బ్యాంకులోను మంచిది.
  • వ్యాపారం విఫలమైతే మీ కుటుంబ పోషణకు ఏం చేయాలో, ఎలా చేయాలో ముందే ప్రణాళిక ఉండాలి. 
  • వ్యాపారం అర్ధంతరంగా ముగించాల్సి వస్తే మౌలిక సదు పాయాలపై (కంప్యూటర్లు, అద్దె, ఫర్నిచర్) పెట్టిన ఖర్చు ఎంత తిరిగొస్తుందో అంచనావేయండి. పెట్టబడిలో ఎంత తిరిగొ స్తుంది? ఎలా బయటపడాలి అని ఆలోచిస్తే వీలైనంత పక్కాగా పెట్టుబడిని పెడతారు.
  • బేక్ ఈవెన్ (లాభాలు చూసేరోజు) పాయింట్ వచ్చేవరకు మీ మూలధనానికి హామీ ఇచ్చే పటిష్టమైన వనరులున్నాయా అనేది చూసుకుని, మీ కుటుంబం గడవడానికి ఏర్పాట్లు చేయండి.
  • మీ సేవ/వస్తువు వినియోగదారుని చేరేంతవరకు ఎన్ని పనులు, ఆటంకాలుంటాయి వంటి వాటి గురించి ఒక సమగ్ర ప్రణాళిక ఉండాలి. ఎంత సమగ్రంగా ప్లాన్ వేసినా దిగాక ఇంకొన్ని కొత్త సమస్యలు వస్తాయి. వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.
  • నమ్మకమైన మనుషులు దొరికితేనే మీ వ్యాపారం నిలబడు తుంది. లేకపోతే మంచి వ్యాపారం కూడా పాడవుతుంది.

1 comment: