Monday, October 29, 2012

"చెప్పుల"కున్న విలువ మనిషికి లేదా?


ఉదయం తొమ్మిదైంది. టిఫిన్ చేసి, పేపరు చదువుతున్నాను. ఇంతలో ఫోను మోగింది. మిత్రుడు క్రాంతి! అవసరమైతే తప్ప కాల్ చేయని వాడి నుంచి ఫోను వచ్చిందంటే వెంటనే ఏదో పని చేసి పెట్టాల్సిందే అనుకుంటూ ఫోన్ ఎత్తాను. ‘నిన్న నా సెకెండ్ హ్యాండ్ కారుకి యాక్సిడెంట్ అయింది. కారు బాగా పాడైంది. ఇరవై వేలు ఖర్చవుతుందన్నారు. పదివేలున్నాయి... మిగిలినవి సర్దితే ఒకటో తేదీ ఇచ్చేస్తాను’ అన్నాడు. ‘ఇన్సూరెన్స్ ఉంటుంది కదా?’ అనగానే- ఏడాదికి మూడు వేలు వృథా ఎందుకని చేయించలేదన్నాడు. 

‘ముందే చేయిస్తే ఇంత ఖర్చుండేది కాదుగా?’ అంటే ‘ప్రతిసారీ జరుగుతుందా? అయినా, నాకు ఈ ఇన్సూరెన్స్‌లు వేస్టనిపిస్తాయి’ అన్నాడు. నాకు కోపమొచ్చి ‘బండి కాబట్టి ఇరవై వేలతో పోయింది. అదే నీకేదైనా అయ్యుంటే’ అనగానే అటునుంచి సౌండ్ లేదు. అప్పుడు నేను ‘మనీ పర్స్’ పుస్తకంలో వంగా రాజేంద్రప్రసాద్ రాసిన ఓ విషయం చెప్పాను. ‘‘గుడి బయట చెప్పులు వదిలితే అవి పోవచ్చు, పోకపోవచ్చు. అయినా రిస్కు తీసుకోకుండా వాటిని రూపాయిచ్చి దాస్తాం. 

ఓ పావుగంట కోసం, అరిగిపోయిన చెప్పుల్ని అంత జాగ్రత్తగా బీమా చేసుకున్న మనం, విలువైన జీవితాన్ని బీమా చేయించడం మరిచిపోవచ్చా? మన జీవితం చెప్పుల కంటే హీనమైనదా?’’ అని! వాడికి జ్ఞానోదయమైనట్లుంది, ‘సాయంత్రం వచ్చినప్పుడు డబ్బుతో పాటు ఆ పుస్తకం కూడా ఇవ్వరా’ అంటూ ఫోను పెట్టేశాడు. పోన్లే ఇప్పటికైనా వీడు మారితే చాలనుకుని నా పన్లో నేను పడిపోయా!

Saturday, October 27, 2012

పర్సనల్ లోన్స్ కు ప్రత్యామ్నాయం



మనకు డబ్బు అత్యవసరమైనప్పుడు వెంటనే కనిపించే ఆప్షన్లు రెండు... మిత్రులు, పర్సనల్ లోన్లు. పెద్ద మొత్తం అయితే వెంటనే మిత్రులు, బంధువులను అడగలేరు కాబట్టి పర్సనల్ లోన్లు తీసుకుంటారు. ఇది అటూ ఇటుగా 2 రూపాయల వడ్డీతో మన నడ్డి విరుస్తుందని చెప్పుకున్నాం కదా!. ఇవి కాకుండా అర్జెంట్‌గా డబ్బు దొరికే మార్గాలున్నాయి తెలుసా! ఇవన్నీ పర్సనల్ లోన్ కంటే తక్కువ వడ్డీకి దొరుకుతాయి. వెంటనే దొరుకుతాయి.

1. మనం పనిచేస్తున్న కంపెనీ నుంచి వడ్డీలేని రుణం అడగొచ్చు.
2. బంగారం పెట్టి రుణం తీసుకోవచ్చు.
3. ఇన్సూరెన్స్, బీమా పాలసీలపై రుణం పొందొచ్చు.
4. ఫిక్స్‌డ్ డిపాజిట్ల తనఖాపై లోను దొరుకుతుంది
5. ఆస్తుల తనఖాపై రుణం పొందొచ్చు.
6. పొదుపు పత్రాలు, బాండ్లపై రుణం పొందొచ్చు.

వ్యాపారం సుఖమా? ఉద్యోగం సుఖమా?


చాలా ఈజీగా కనిపించే కష్టమైన ప్రశ్న ఇది. మనిషి మనిషికీ సమాధానం మారుతుంటుంది. కాబట్టి, ప్రశ్న అడుగుతున్నదెవరు అన్నదానిని బట్టి దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఉద్యోగం అంటే ఎవరో ఒకరి కింద పనిచేయాలి. అదే వ్యాపారం అయితే మనకు మనమే బాస్ అనుకుంటారు చాలా మంది. ఇది అపోహ. ఉద్యోగంలో బాస్ ఒక్కరి మాట వింటే చాలు. వ్యాపారంలో ప్రతి వినియోగదారుడూ బాసే. అంతేకాదు, అది ఒక గాడిలో పడేంతవరకు ఎదురయ్యే సమస్యలు, ఆటంకాలు ఉద్యోగంలోనైతే ఎన్నడూ రావు. కష్టానికీ, నష్టానికీ మీరే బాధ్యులు అవుతారు. ఎంత చిన్న వ్యాపారం అయినా ఈ సమస్యలు తప్పవు. పెద్దమొత్తంలో డబ్బు కళ్ల చూడాలన్నా, మీ సమర్థత పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నా, స్వతంత్ర గుర్తింపు రావాలన్నా వ్యాపారం చేయాలి. ఏ వ్యాపారం మొదలుపెట్టే ముందయినా ఈ టిప్స్ తెలుసుకోవడం మంచిది. కీడెంచి మేలు ఎంచాలి కదా!


  • అప్పులు చేసి వ్యాపారం చేయొద్దు. పెట్టుబడి ఎంత పెడు తున్నారో అంతకు రెండు రెట్ల (కనీసం రెట్టింపు) సొమ్ము నిల్వ ఉండాలి. కొన్ని వ్యాపారాలకు బ్యాంకులోను మంచిది.
  • వ్యాపారం విఫలమైతే మీ కుటుంబ పోషణకు ఏం చేయాలో, ఎలా చేయాలో ముందే ప్రణాళిక ఉండాలి. 
  • వ్యాపారం అర్ధంతరంగా ముగించాల్సి వస్తే మౌలిక సదు పాయాలపై (కంప్యూటర్లు, అద్దె, ఫర్నిచర్) పెట్టిన ఖర్చు ఎంత తిరిగొస్తుందో అంచనావేయండి. పెట్టబడిలో ఎంత తిరిగొ స్తుంది? ఎలా బయటపడాలి అని ఆలోచిస్తే వీలైనంత పక్కాగా పెట్టుబడిని పెడతారు.
  • బేక్ ఈవెన్ (లాభాలు చూసేరోజు) పాయింట్ వచ్చేవరకు మీ మూలధనానికి హామీ ఇచ్చే పటిష్టమైన వనరులున్నాయా అనేది చూసుకుని, మీ కుటుంబం గడవడానికి ఏర్పాట్లు చేయండి.
  • మీ సేవ/వస్తువు వినియోగదారుని చేరేంతవరకు ఎన్ని పనులు, ఆటంకాలుంటాయి వంటి వాటి గురించి ఒక సమగ్ర ప్రణాళిక ఉండాలి. ఎంత సమగ్రంగా ప్లాన్ వేసినా దిగాక ఇంకొన్ని కొత్త సమస్యలు వస్తాయి. వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.
  • నమ్మకమైన మనుషులు దొరికితేనే మీ వ్యాపారం నిలబడు తుంది. లేకపోతే మంచి వ్యాపారం కూడా పాడవుతుంది.

డబ్బును ప్రేమించండి : ప్రకాష్ చిమ్మల ఆర్థిక సూత్రాలు


డబ్బు. ఆరో భూతం. ఈ కామెంట్ వెనుక మీరు అర్థం చేసుకున్నది, నేను చెప్పాలనుకున్నది రెండూ ఉన్నాయి. "డబ్బు భూతం వంటిది అని మీకు అర్థమైతే పంచ భూతాలకు తోడు ఇది కూడా కలపాలి. అప్పుడు ఆరవుతాయి అంటాను.''
"మీకు పంచభూతాలకు ఇది కూడా కలపాలని అర్థమైతే... అది ఎంత అవసరమైనదో అంత ప్రమాదకరమైనది (భూతం వంటిది) అని చెబుతాను."
అంటే మీకు స్థూలంగా మీకు తెలిసిన విషయాలు కాకుండా కొత్త విషయాలు చెబుతాను, కనీసం చెప్పడానికి ప్రయత్నిస్తాను అన్నది నా భావం.
ఇక నుంచి డబ్బు గురించి సమస్త అంశాలను మీకు నా శక్తి మేర అందిండానికి ప్రయత్నిస్తాను.
దయచేసి డబ్బును ద్వేషించకండి. అది మిమ్మల్ని వేధిస్తుంది !!


- నేను మీకు ఉపయోగడతానని భావిస్తూ, పడాలని కోరుకుంటున్నాను.