Tuesday, December 11, 2012

డబ్బే జీవితం కాదు!


ప్రతి మనిషికీ సంపాదించాలని ఉంటుంది... అయితే, మార్గాలు వేర్వేరు. కొందరు కుటుంబ జీవితం పాడుకాకుండా అటు సమయం కేటాయిస్తూనే తమ లక్షసాధనలో ఫలవంతులవుతారు. మరికొందరు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోలేక తికమకపడుతుంటారు. ఇంకొందరు లక్ష్యం కోసం అందరినీ, అన్నిటినీ వదులకుంటారు! ఇలాంటి వారిని కేంద్రంగా చేసుకుని తీసిన సినిమాయే జందగీ న మిలేగీ దొబారా!

ముగ్గురు హీరోల్లో ఒకడైన అర్జున్ (హృతిక్ రోషన్) లండన్‌లోని ఓ పెద్ద కంపెనీలో ఫైనాన్షియల్ ట్రేడర్‌గా పని చేస్తుంటాడు. అతని లక్ష్యం.... నలభయ్యేళ్లలోపు వీలైనంత సంపాదించాలని! రాత్రీ పగలూ తేడా లేకుండా డబ్బు సంపాదనలో మునిగిపోతాడు. అతనికి టూర్‌లో ఓ అమ్మాయి పరిచయమవుతుంది. నలభయ్యేళ్లలోపే చాలా సంపాదించాలనుకుంటున్నానని చెబితే ఆమె ఒక ప్రశ్న అడుగుతుంది... ‘అప్పటికి నువ్వు బతికుండకపోతే ఏంటి పరిస్థితి?’ అని!

అర్జున్‌లా ఆలోచించే వాళ్లందరికీ ఈ ప్రశ్న వర్తిస్తుంది! ఏదో సాధించాలన్న కసి ఉండొచ్చు. ఎంతో సంపాదించాలన్న తపన ఉండొచ్చు. కానీ, ఆ ప్రాసెస్‌లో యవ్వనాన్ని, భార్యాపిల్లల్ని గాలికొదిలేయకూడదు. ఒకవేళ అలా సంపాదించినా ఆ విజయాన్ని చెప్పుకోవడానికి కూడా మన దగ్గర ఎవరూ మిగలరు.

Friday, November 23, 2012

బ్యాంకుల్లో డబ్బు దాస్తే మీరు నష్టపోయినట్టే !



జనాభాలో ట్రెండ్ సెట్టర్లు తక్కువుంటారు. ట్రెండ్ ఫాలోయర్లు ఎక్కువుంటాయి. ఇది డ్రెస్సులకు, స్టైల్స్ కే కాదు, సంపాదనకూ వర్తిస్తుంది. డబ్బు దాచడం అనే విషయం ఇండియన్లకు బాగా తెలుసు కానీ, అది ఎక్కడ దాచాలన్నది చాలామందికి తెలియదు. ద్రవ్యోల్భణం అదుపులో ఉండే రోజుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు వర్కవుట్ అయ్యాయి. ఎందుకంటే బ్యాంకు వడ్డీరేట్లు ద్రవ్యోల్భణం కంటే తక్కువున్నాయి. బ్యాంకు వడ్డీరేటు ద్రవ్యోల్బణం కంటే ఎక్కువగా ఉంటే మన డబ్బు పెరుగుతుంది. ద్రవ్యోల్భణం కంటే తక్కువగా ఉంటే మన డబ్బు బ్యాంకులో పెట్టడం వల్ల విలువు కోల్పోతోంది. సెప్టంబరు గణాంకాల ప్రకారం ద్రవ్యోల్భణం రేటు 9.14 ఉంది. ప్రస్తుతం బ్యాంకు వడ్డీరేటు 8 శాతం ఉంది. ఈ లెక్కన మీ డబ్బు బ్యాంకులో దాస్తే అది ప్రతి సంవత్సరం 1.14 శాతం విలువ కోల్పోతూ ఉంటుంది. అందుకే డబ్బు దాచడం కంటే అది ఎక్కడ దాచాం అన్నది చాలా ఇంపార్టెంట్.

ఇక రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే అదెప్పటికీ మంచిదే. కానీ, ఇప్పుడు కొనేవాళ్లు 2005 ఏడాదికి ముందు కొనేవాళ్లంత అదృష్టవంతులు కాదు. గతంలోలాగా మీరు కొనే స్థలంలో రెండు మూడేళ్లలో డబుల్ అయ్యే పరిస్థితి లేదు. అందుకే ఇందులో కూడా ఆచితూచి అడుగేయాలి. వెయ్యి రూపాయల గజం భూమి ఐదువేలకు పెరగడం చాలా సులువు గానీ, ఐదు వేలు పెట్టి కొనే గజం భూమి కనీసం రెట్టింపవడానికి అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. మనకూ ఓ స్థలమో, ఆస్తో ఉండాలని ఎక్కడ పడితే అక్కడ స్థలం, ఫ్లాటు కొనకూడదు. ఉదాహరణకు కొంపల్లి వైపు ఫ్లాట్లు కొన్నవారు ఇప్పటికీ అదే రేట్లు ఉండటంతో తీవ్రంగా నష్టోతుంటే గచ్చిబౌలి వైపు  ఫ్లాటు కొన్నవారు డబుల్, త్రిబుల్ అయ్యి సంపన్నులయ్యారు. కాబట్టి, ఆస్తి అనేది భవిష్యత్తు కోసం కొనేది కాబట్టి మీ ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాకుండా భవిష్యత్తులో గిరాకీని దృష్టిలో ఉంచుకుని కొనండి.  ఇపుడు మీరు ఆంధ్రప్రదేశ్ లో ఏ మారుమూల మండల కేంద్రంలో వెళ్లి అడిగినా సెంటు 30 నుంచి రెండు లక్షలు పలుకుతోంది. ఇది రియల్ ఎస్టేట్ మాయ. అదే, రెండు హైవేలు ఉన్న నగరం ఉడిపి (కర్ణాటక)లో సముద్ర తీరానికి దగ్గరలో కేవలం యాభై వేలు సెంటు దొరకుతుంది. మనవాళ్లకు అంత స్థలాల పిచ్చి. కాబట్టి భవిష్యత్తును అంచనా వేసి మన డబ్బు వీలైనంత త్వరగా రెట్టింపయ్యే విధంగా ఆలోచించాలి. 

లోను లేకుండా మొత్తం డబ్బు పెట్టి కొన్న ఇల్లు/స్థలం ఐదేళ్లలో రెట్టింపు కాలేదంటే మీ ఆస్తుల విలువ తగ్గినట్లు. లోను తీసుకుని కొంటే 8 సంవత్సరాల్లోపు, నగదుతో కొంటే నాలుగేళ్లలోపు  మీ ఆస్తుల విలువ రెట్టింపయితే గిట్టుబాటు. 

Tuesday, November 20, 2012

చిత్తూరు నాగయ్య పేదోడెలా అయ్యారు



 చిత్తూరు నాగయ్య అప్పట్లోనే అత్యధిక పారితోషికం పొందిన నటుడు. 1948లోనే ఆయన పారితోషికం లక్ష రూపాయలట! ఏ దురలవాటూ లేని వ్యక్తికి అంతటి ఆదాయం ఉంటే తన జీవితాన్ని సుసంపన్నంగా గడుపుతారనే మన మనుకుంటాం. కానీ, నాగయ్య దీనికి విరుద్ధమైన జీవితాన్ని గడిపారు. ఆయన జీవిత చరమాంకంలో చిన్న అవసరాలకు కూడా ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికంతటికీ కారణం... ‘తనకు మాలిన ధర్మం’!

దక్షిణ భారతదేశంలో నటనలో తొలిసారి పద్మశ్రీ అవార్డు పొందిన ఈయన నటనే కాదు, మనసు కూడా గొప్పది! సినిమా నిర్మాణం వల్ల నష్టపోయిన దానికంటే, తన అనాలోచిత దానధర్మాల వల్ల ఆస్తి ఎక్కువగా కరిగిపోయిందని తనే స్వయంగా పలుసార్లు వెల్లడించారు. మొదటినుంచీ బమ్మెర పోతన, వేమన వంటి పాత్రలు ఆయన మీద విపరీతమైన ప్రభావం చూపాయి. అసలే ఆయన చేతికి ఎముకుండదంటే, ఆ పాత్రలు వేయడం వల్ల అది ఇంకా శృతిమించింది.

‘త్యాగయ్య’ సినిమా తీసినన్నాళ్లు పనిచేసిన ప్రతి ఒక్కరికీ భోజనం, బస ఆయన రేణుకా ఆఫీసులోనే! అవుట్‌డోర్ షూటింగులని చూడడానికి వచ్చిన జనాలకి కూడా భోజనం పెట్టమనేవారట! అదే ఆయన్ను చివరి నాళ్లలో పేదరికంలోకి నెట్టింది. పొట్టపోసుకోవడానికి వంద రూపాయలకు కూడా వేషాలు వేసే పరిస్థితి వచ్చింది! దీంతో అత్యధిక, అత్యల్ప పారితోషికాల రికార్డు ఆయనదే అయ్యింది!

చివరి రోజులలో పేదరికాన్ని అనుభవిస్తున్నపుడు ఆయనన్న మాటలివి:  
నా జీవితం అందరికీ ఒక పాఠం. తనకు మాలిన ధర్మం చెయ్యకండి. అపాత్రదానాలు చెయ్యకండి. ఎందరో గోముఖవ్యాఘ్రాలు వుంటారు. అందర్నీ నమ్మకండి!  నిజంగా అవసరం ఉన్నవారికి సాయం చేయండి. కానీ, అది ఓ పరిమితి వరకు చేయండి. మీరు నాశనమయ్యేవరకు చేయకండి


Sunday, November 18, 2012

ఇంటి రుణంపై జాగ్రత్తలు



ఇల్లు... ప్రతి ఒక్కరి కల. పూర్వం ఒకట్రెండు సంవత్సరాల ఆదాయంతో ఇల్లు కట్టుకునేవాళ్లం. ఇప్పుడు మన జీవితకాల ఆదాయం ఇంటద్దకే పోయే పరిస్థితి. జనాభాతో పాటు పెరగని భూములే దీనికి కారణం. రుణాలు తీసుకోకుండా ఇల్లు కట్టే పరిస్థితి లేదిప్పుడు! కాకపోతే కాస్త ఓపిక పట్టి వివిధ బ్యాంకు హోమ్ లోన్లను పరిశీలిస్తే, దానిలో కూడా కొంత పొదుపు చేయవచ్చు. ఆ టిప్స్ మీకోసం.



  • బ్యాంకుల వద్ద ఉన్న పెద్ద మైనస్ వాటి హిడెన్ చార్జెస్ (పైకి చెప్పని రుసుములు). ముందుగా బ్యాంకులో ఏమేం ఫీజులుంటాయో నిర్ధారించుకుని అప్పుడు మొదలెట్టండి. లీగల్ ఛార్జెస్, ప్రీపేమెంట్ చార్జెస్, వాల్యుయేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు, కమిట్‌మెంట్ ఫీజు వంటివి ఏవి ఉన్నాయి, వాటికి ఎంత కట్టాలన్నది కనుక్కోవాలి. 
  • అన్ని బ్యాంకుల్లో వడ్డీలు ఒకేరకంగా ఉండవు. అలాగే అందరు కస్టమర్లకు ఒకేరకంగా లోన్లు దొరకవు. కాబట్టి అన్ని బ్యాంకులు తిరగాలి. ఇంటర్‌నెట్, ఫోన్ సాయం తీసుకుంటే సమయం కలిసొస్తుంది. లోన్ అమౌంట్‌ని బట్టి బేరాలు ఆడొచ్చు.
  • లోన్ మేళా ఆఫర్ల కింద కొన్ని బ్యాంకు అర శాతం, పావు శాతం వడ్డీలు తగ్గిస్తాయి. 
  • కొన్ని బ్యాంకుల్లో హోమ్ లోన్ ఇన్సూరెన్స్ ఉచితంగా ఇస్తారు. అన్నీ బేరీజు వేసుకుని లాభదాయకంగా అనిపిస్తే దాన్ని ఎంచుకోవడం మంచిది. ఒకవేళ లోనుతో పాటు ఇన్సూరెన్స్ రాకపోతే మీరు తప్పకుండా చేయించుకోవాలి.
  • వడ్డీ రేట్లు మేనేజర్ విచక్షణ మీద కూడా ఆధారపడి ఉంటాయి. మార్కెట్లో ఎక్కడ తక్కువో ఆ బ్యాంకుకెళ్లి బేర మాడండి. వేరే బ్యాంకుల ప్లస్ చూపించి అన్నీ పరిశీలించే వచ్చామన్న భావన మేనేజర్‌లో కల్పిస్తే వడ్డీ రేటు వెసులుబాటు ఉండొచ్చు.
  • కొన్ని ఆర్థిక సంస్థలు కొన్ని రకాల డాక్యుమెంట్లు లేకపోయినా రుణాలిస్తాయి. కాకపోతే ఎక్కువ వడ్డీ ఉంటుంది. డాక్యుమెంట్లకు బద్దకిస్తే మొదటికే మోసం.
  • ఇల్లు పూర్తి డబ్బుతో, పూర్తి లోనుతో కొనడం మంచిది కాదు. కాబట్టి... కొంత అడ్వాన్సు కట్టి కొనడమే అన్ని విధాల మంచిది.


Saturday, November 17, 2012

శోభన్ బాబు కోటీశ్వరుడు ఎలా అయ్యాడు?


శోభన్‌బాబు ప్రతిఒక్కరికీ ఒక్కో విషయంలో స్ఫూర్తి నిలిచిన వ్యక్తి. మహిళల దృష్టిలో ఓ మంచి భర్త, యువతుల దృష్టిలో మంచి అందగాడు, చెల్లెలి దృష్టిలో ఓ మంచి అన్న, అభిమానుల దృష్టిలో ఓ మంచి హీరో, పరిశ్రమ దృష్టిలో ఓ మంచి కళాకారుడు... వీళ్లందరి దృష్టిలో ఎలా జీవించాలో తెలిసిన మొనగాడు. 

పొదుపు, మదుపు రెండూ తెలిసిన అరుదైన సెలబ్రిటీ శోభన్‌బాబు. అడ్డదారులు తొక్కకుండానే కోట్లకు పడగలెత్తిన వ్యక్తి. ‘జనాభా ఎంత పెరిగినా పెరగనిది భూమి. దాన్ని కొను. నీ జీవితం మారిపోతుంది’ అని ఆయన చెప్పిన మాటలతోనే నేనింత వాణ్ణి అయ్యానని మురళీమోహన్ చెబుతుంటారు. అంతేకాదు, ‘టైమ్ ఈజ్ మనీ’ అని, దాన్ని మనవాళ్లకు ఆస్తులతో పాటు పంచాల్సిన విషయమని తోటి కళాకారులందరికీ చెప్పేవారు. 

తానలానే గడిపాడు. పొదుపు ఒక్కటే చాలదని, మదుపు కూడా చాలా అవసరమని అనేవారు. అలాగే రియల్‌ఎస్టేట్‌లో దిగి ఎప్పటికప్పుడు స్థలాలు కొన్నారు. వాటిపై భవనాలు కట్టి, ఆ ఆదాయంతో మళ్లీ స్థలాలు కొనేవారు. ఇలా మద్రాసులో ఆయనకు చాలా భవనాలున్నాయి. 

Monday, October 29, 2012

"చెప్పుల"కున్న విలువ మనిషికి లేదా?


ఉదయం తొమ్మిదైంది. టిఫిన్ చేసి, పేపరు చదువుతున్నాను. ఇంతలో ఫోను మోగింది. మిత్రుడు క్రాంతి! అవసరమైతే తప్ప కాల్ చేయని వాడి నుంచి ఫోను వచ్చిందంటే వెంటనే ఏదో పని చేసి పెట్టాల్సిందే అనుకుంటూ ఫోన్ ఎత్తాను. ‘నిన్న నా సెకెండ్ హ్యాండ్ కారుకి యాక్సిడెంట్ అయింది. కారు బాగా పాడైంది. ఇరవై వేలు ఖర్చవుతుందన్నారు. పదివేలున్నాయి... మిగిలినవి సర్దితే ఒకటో తేదీ ఇచ్చేస్తాను’ అన్నాడు. ‘ఇన్సూరెన్స్ ఉంటుంది కదా?’ అనగానే- ఏడాదికి మూడు వేలు వృథా ఎందుకని చేయించలేదన్నాడు. 

‘ముందే చేయిస్తే ఇంత ఖర్చుండేది కాదుగా?’ అంటే ‘ప్రతిసారీ జరుగుతుందా? అయినా, నాకు ఈ ఇన్సూరెన్స్‌లు వేస్టనిపిస్తాయి’ అన్నాడు. నాకు కోపమొచ్చి ‘బండి కాబట్టి ఇరవై వేలతో పోయింది. అదే నీకేదైనా అయ్యుంటే’ అనగానే అటునుంచి సౌండ్ లేదు. అప్పుడు నేను ‘మనీ పర్స్’ పుస్తకంలో వంగా రాజేంద్రప్రసాద్ రాసిన ఓ విషయం చెప్పాను. ‘‘గుడి బయట చెప్పులు వదిలితే అవి పోవచ్చు, పోకపోవచ్చు. అయినా రిస్కు తీసుకోకుండా వాటిని రూపాయిచ్చి దాస్తాం. 

ఓ పావుగంట కోసం, అరిగిపోయిన చెప్పుల్ని అంత జాగ్రత్తగా బీమా చేసుకున్న మనం, విలువైన జీవితాన్ని బీమా చేయించడం మరిచిపోవచ్చా? మన జీవితం చెప్పుల కంటే హీనమైనదా?’’ అని! వాడికి జ్ఞానోదయమైనట్లుంది, ‘సాయంత్రం వచ్చినప్పుడు డబ్బుతో పాటు ఆ పుస్తకం కూడా ఇవ్వరా’ అంటూ ఫోను పెట్టేశాడు. పోన్లే ఇప్పటికైనా వీడు మారితే చాలనుకుని నా పన్లో నేను పడిపోయా!

Saturday, October 27, 2012

పర్సనల్ లోన్స్ కు ప్రత్యామ్నాయం



మనకు డబ్బు అత్యవసరమైనప్పుడు వెంటనే కనిపించే ఆప్షన్లు రెండు... మిత్రులు, పర్సనల్ లోన్లు. పెద్ద మొత్తం అయితే వెంటనే మిత్రులు, బంధువులను అడగలేరు కాబట్టి పర్సనల్ లోన్లు తీసుకుంటారు. ఇది అటూ ఇటుగా 2 రూపాయల వడ్డీతో మన నడ్డి విరుస్తుందని చెప్పుకున్నాం కదా!. ఇవి కాకుండా అర్జెంట్‌గా డబ్బు దొరికే మార్గాలున్నాయి తెలుసా! ఇవన్నీ పర్సనల్ లోన్ కంటే తక్కువ వడ్డీకి దొరుకుతాయి. వెంటనే దొరుకుతాయి.

1. మనం పనిచేస్తున్న కంపెనీ నుంచి వడ్డీలేని రుణం అడగొచ్చు.
2. బంగారం పెట్టి రుణం తీసుకోవచ్చు.
3. ఇన్సూరెన్స్, బీమా పాలసీలపై రుణం పొందొచ్చు.
4. ఫిక్స్‌డ్ డిపాజిట్ల తనఖాపై లోను దొరుకుతుంది
5. ఆస్తుల తనఖాపై రుణం పొందొచ్చు.
6. పొదుపు పత్రాలు, బాండ్లపై రుణం పొందొచ్చు.