Monday, October 29, 2012

"చెప్పుల"కున్న విలువ మనిషికి లేదా?


ఉదయం తొమ్మిదైంది. టిఫిన్ చేసి, పేపరు చదువుతున్నాను. ఇంతలో ఫోను మోగింది. మిత్రుడు క్రాంతి! అవసరమైతే తప్ప కాల్ చేయని వాడి నుంచి ఫోను వచ్చిందంటే వెంటనే ఏదో పని చేసి పెట్టాల్సిందే అనుకుంటూ ఫోన్ ఎత్తాను. ‘నిన్న నా సెకెండ్ హ్యాండ్ కారుకి యాక్సిడెంట్ అయింది. కారు బాగా పాడైంది. ఇరవై వేలు ఖర్చవుతుందన్నారు. పదివేలున్నాయి... మిగిలినవి సర్దితే ఒకటో తేదీ ఇచ్చేస్తాను’ అన్నాడు. ‘ఇన్సూరెన్స్ ఉంటుంది కదా?’ అనగానే- ఏడాదికి మూడు వేలు వృథా ఎందుకని చేయించలేదన్నాడు. 

‘ముందే చేయిస్తే ఇంత ఖర్చుండేది కాదుగా?’ అంటే ‘ప్రతిసారీ జరుగుతుందా? అయినా, నాకు ఈ ఇన్సూరెన్స్‌లు వేస్టనిపిస్తాయి’ అన్నాడు. నాకు కోపమొచ్చి ‘బండి కాబట్టి ఇరవై వేలతో పోయింది. అదే నీకేదైనా అయ్యుంటే’ అనగానే అటునుంచి సౌండ్ లేదు. అప్పుడు నేను ‘మనీ పర్స్’ పుస్తకంలో వంగా రాజేంద్రప్రసాద్ రాసిన ఓ విషయం చెప్పాను. ‘‘గుడి బయట చెప్పులు వదిలితే అవి పోవచ్చు, పోకపోవచ్చు. అయినా రిస్కు తీసుకోకుండా వాటిని రూపాయిచ్చి దాస్తాం. 

ఓ పావుగంట కోసం, అరిగిపోయిన చెప్పుల్ని అంత జాగ్రత్తగా బీమా చేసుకున్న మనం, విలువైన జీవితాన్ని బీమా చేయించడం మరిచిపోవచ్చా? మన జీవితం చెప్పుల కంటే హీనమైనదా?’’ అని! వాడికి జ్ఞానోదయమైనట్లుంది, ‘సాయంత్రం వచ్చినప్పుడు డబ్బుతో పాటు ఆ పుస్తకం కూడా ఇవ్వరా’ అంటూ ఫోను పెట్టేశాడు. పోన్లే ఇప్పటికైనా వీడు మారితే చాలనుకుని నా పన్లో నేను పడిపోయా!

No comments:

Post a Comment